బెంగళూరుకు చెందిన బ్లాక్ బక్ కంపెనీ సీఈవో రాజేష్ యాబాజీ, తమ నగరంలోని రోడ్ల దుస్థితిపై ట్వీట్ చేయడంతో ఈ వివాదం మొదలైంది. రాజేష్ యాబాజీ తన ట్వీట్‌లో, బెంగళూరులో గంటన్నర ప్రయాణ సమయం, రోడ్లపై గుంతలు, దుమ్ము కారణంగా తమ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, దీని వల్ల తాము వేరే ప్రాంతానికి వెళ్లాలని ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ట్వీట్ జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
ఈ ట్వీట్‌కు ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ, రాజేష్ యాబాజీని తమ కంపెనీని విశాఖపట్నానికి మార్చాలని ఆహ్వానించారు. విశాఖపట్నం దేశంలోనే పరిశుభ్రమైన నగరాలలో ఒకటని, మంచి మౌలిక సదుపాయాలు, మహిళలకు భద్రత ఉన్న నగరమని లోకేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
అయితే, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. ఈ రకమైన బెదిరింపులు, బ్లాక్ మెయిల్ లకు తమ ప్రభుత్వం లొంగదని, బెంగళూరు రోడ్ల మరమ్మత్తుల కోసం ఇప్పటికే రూ.1100 కోట్లు కేటాయించిందని తెలిపారు. నవంబర్ నాటికి రోడ్ల మరమ్మత్తులను పూర్తిచేయడానికి గడువు విధించామని కూడా ఆయన వివరించారు.
డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేష్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఏకంగా బెదిరించేశారు. “మిగిలిన రాష్ట్రాలకు, ఆంధ్రప్రదేశ్ కు ఉన్న తేడా అదే. మా ప్రజల నిజమైన సమస్యలను బ్లాక్ మెయిల్ గా కొట్టిపారేయలేం. వాటిని మర్యాదపూర్వకంగా శ్రద్ధ చూపించి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాం,” అని లోకేష్ ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలతో ఇరు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య జరుగుతున్న ఈ కొత్త రాజకీయ వివాదం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.