రాజకీయాల్లో పెద్ద బాంబ్ పేల్చినట్లుగా జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. ప్రజలు లోపల గుసగుసలు పెట్టుకునే విషయాన్ని బహిరంగ వేదికపై పెట్టడంతో ఆయన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీశాయి.
బొలిశెట్టి స్పష్టంగా చెప్పారు. “100లో 99 మంది ఎమ్మెల్యేలు లంచాలు తీసుకుంటున్నారు. కానీ దాన్ని బయట పెట్టడానికి ఎవరికీ ధైర్యం ఉండదు. నేను మాత్రం అడ్డంపెట్టుకుని చెబుతున్నా”. ఈ మాటలు విన్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
ఎన్నికల్లో గెలవడానికి అభ్యర్థులు 50-60 కోట్లు వెచ్చించడం వెనక కారణాన్ని కూడా ఆయన బయటపెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ డబ్బును వడ్డీతో సహా వసూలు చేసుకోవడమే లక్ష్యం అని ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. అంటే ప్రజాస్వామ్యంలో జరుగుతున్న “ఇన్వెస్ట్‌మెంట్ – రికవరీ” సిస్టమ్‌నే ఆయన బహిర్గతం చేశారు.
ఇంకా ముందుకెళ్లి “నేను పదవిని అడ్డంపెట్టుకుని లంచాలు తీసుకుంటున్నా.. దోచుకున్న సొమ్ముతో అభివృద్ధి చేద్దాం” అని చెప్పడం మరింత సంచలనం రేపింది. సిగ్గులేకుండా ఈ నిజాన్ని బయటపెట్టడం తనదైన ధైర్యమని ఆయన వాదిస్తున్నారు.
పార్టీలకతీతంగా అన్ని చోట్లా ఇదే పరిస్థితి ఉందని, ఇది ఒక బహిరంగ రహస్యం అని ఆయన చెప్పిన మాటలు ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తున్నాయి. అధికారంలో ఉన్నా, లేకపోయినా లంచాల వ్యవస్థ అంతటా బలంగా వేరులు వేసుకుందని ఆయన ప్రకటన మరోసారి రుజువు చేసింది.
బొలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. రాజకీయ నాయకులు నోరు విప్పకపోయినా, ఆయన బయట పెట్టిన వాస్తవాలు ప్రజలలో మళ్లీ “మన ఓటుతో ఎవరు గెలిచినా పరిస్థితి మారదా?” అన్న సందేహాన్ని కలిగిస్తున్నాయి.