ఆంధ్రప్రదేశ్ మీడియా వాతావరణంలో మరోసారి ‘ఎల్లో మీడియా’ అనే పదం పెద్ద చర్చకు దారితీసింది. ఆంధ్రజ్యోతి మీడియా సంస్థను లక్ష్యంగా చేసుకుని కొంతమంది జర్నలిస్టులు, సామాజిక వర్గాలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాయని, దీనిపై తాను తీవ్ర ఆవేదనకు గురవుతున్నానని ఏబీఎన్ చానెల్ లైవ్ కార్యక్రమంలో యాంకర్ వెంకటకృష్ణ భావోద్వేగంగా స్పందించారు.
సమాజంలో జర్నలిస్టులంతా ఆంధ్రజ్యోతి వల్లే రాష్ట్రానికి నష్టం జరుగుతోందని, సీనియర్ జర్నలిస్టులు కూడా ఆ మీడియా సంస్థను ‘శాపం’గా అభివర్ణిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని వెంకటకృష్ణ ప్రస్తావించారు. అంతేకాదు తమను ‘ఎల్లో మీడియా’ అంటూ అవహేళనగా పిలవడాన్ని కూడా ఆయన తీవ్రంగా ఖండించారు.
మీడియా మనిషిగా జర్నలిస్టుగా పని చేస్తున్న వ్యక్తులు ఇలా పిచ్చి కూతలు కూస్తూ, మొత్తం సంస్థను ఒకే ముద్రతో దూషించడం సరైంది కాదని వెంకటకృష్ణ అన్నారు. ఆంధ్రజ్యోతి మీడియాను టార్గెట్ చేస్తూ జరుగుతున్న వ్యాఖ్యలపై తనలో పేరుకుపోయిన అసహనాన్ని, ఫ్రస్ట్రేషన్‌ను లైవ్ టీవీ కార్యక్రమంలోనే వ్యక్తం చేశారు.
“అవును… మేము ఎల్లో మీడియానే కావచ్చు. కానీ అందరూ ఇష్టమొచ్చినట్లు అలా పిలవకూడదు. జర్నలిజంలో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. కానీ వ్యక్తిగత దూషణలు, సంస్థల్ని తక్కువ చేసి మాట్లాడటం ప్రజాస్వామ్యానికి మేలు చేయదు” అంటూ వెంకటకృష్ణ ఘాటుగా స్పందించారు.
ఈ వ్యాఖ్యలు వెలువడిన వెంటనే సోషల్ మీడియాలోనూ చర్చ మొదలైంది. కొంతమంది వెంకటకృష్ణ మాటలకు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు మాత్రం మీడియా స్వయంకృతాపరాధాలే ఇలాంటి విమర్శలకు కారణమని వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనా, ఆంధ్రప్రదేశ్‌లో మీడియా విశ్వసనీయత, జర్నలిజం విలువలపై ఈ వివాదం మరోసారి పెద్ద ప్రశ్నల్ని లేవనెత్తింది.
ఈ మొత్తం వ్యవహారంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పాత్రపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుండగా, యాంకర్ వెంకటకృష్ణ వ్యాఖ్యలు మీడియా వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.


