ఆదోనిలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి సంబంధించి కిమ్స్ ఆసుపత్రి టెండర్ వేసిందన్న ప్రచారం పూర్తిగా అబద్ధమని కిమ్స్ యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ అంశంపై వస్తున్న వార్తలు వాస్తవాలకు దూరమని, తమ సంస్థ ఎలాంటి బిడ్ కూడా దాఖలు చేయలేదని స్పష్టీకరించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాలుగు మెడికల్ కాలేజీల కోసం టెండర్లు పిలిచిన సందర్భంలో, ఆదోని మెడికల్ కాలేజీకి కిమ్స్ టెండర్ వేసిందన్న ఫేక్ ప్రచారం సోషల్ మీడియా, కొన్ని వర్గాల్లో వైరల్ అయింది. అయితే దీనిపై స్పందించిన కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం తాము ఎలాంటి టెండర్లు వేయలేదని, కాలేజీ నిర్మాణానికి బిడ్ చేసినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని తేల్చి చెప్పింది.
ఈ గందరగోళానికి కారణం ఒక కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రమేనని వివరించారు. కిమ్స్ ఆసుపత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్న ప్రేమ్ చంద్ షా అనే వ్యక్తి పేరు మీద టెండర్ వచ్చినట్లు సమాచారం ఉండటంతో, అది కిమ్స్ సంస్థే టెండర్ వేసిందని కొందరు పొరబడ్డారని తెలిపారు. అయితే వ్యక్తిగతంగా వచ్చిన టెండర్‌ను సంస్థ టెండర్‌గా భావించడం తప్పు అని కిమ్స్ యాజమాన్యం స్పష్టం చేసింది.
ఈ విషయంపై స్పందించిన మంత్రి సత్య కుమార్ కూడా మెడికల్ కాలేజీ కోసం కిమ్స్ ఎలాంటి బిడ్ వేయలేదని, ఇది చిన్న కమ్యూనికేషన్ లోపం వల్ల ఏర్పడిన అపార్థమని తెలిపారు. తప్పుడు ప్రచారాలకు తావులేకుండా వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు.
మొత్తానికి, ఆధోనిలో పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి కిమ్స్ ఆసుపత్రి టెండర్ వేసిందన్న ప్రచారం నిరాధారమని అధికారికంగా తేలిపోయింది.


