చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో యువకుడిపై దాడికి సంబంధించిన సంఘటనలో ఊహించని మలుపు చోటు చేసుకుంది. జనసేన నాయకుడు దినేష్ అలియాస్ సెటిల్మెంట్ దినేష్ యువకుడిపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దాడికి గురైన యువకుడు పవన్.. జనసేన నాయకుడు దినేష్ తన వరుసకు అన్న అవుతాడని, తనను మోసం చేయడం వల్లే కొట్టాడని చెబుతూ ఓ వీడియో విడుదల చేశాడు.
పవన్ చెప్పిన దాని ప్రకారం.. దినేష్ తనతో పాటు మరొకరి వద్ద కూడా తిరుమల ఎల్ 1 దర్శనం మరియు ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేశాడు. ఈ విషయంపై ప్రశ్నించినందుకే దినేష్ తనను కొట్టాడని పవన్ వీడియోలో పేర్కొన్నాడు.
ఇటీవల, పవన్‌ను దినేష్ కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఇది జనసేన నాయకుడు దినేష్ అనే పేరుతో ప్రచారంలోకి వచ్చింది.
ఈ వీడియో వైరల్ కావడంపై పవన్ మాట్లాడుతూ, “నిజానికి దినేష్ నాకు అన్న వరుస అవుతాడు. మా మధ్య విభేదాలు ఉన్నాయి. అందుకే నన్ను కొట్టాడు. ఇప్పుడు ఈ వీడియోని టైంపాస్ కోసం వైరల్ చేస్తున్నారు తప్ప ఇందులో ఇంకేమీ లేదు,” అని స్పష్టం చేశాడు.
ఈ సంఘటనపై రాజకీయంగా కూడా తీవ్ర చర్చ జరిగింది. కొందరు దినేష్ వైసీపీ నాయకుడని ఆరోపిస్తే, వైసీపీ మాత్రం అతను కూటమి పార్టీకి చెందినవాడని ఆరోపించింది.