ఆంధ్రజ్యోతి పత్రిక, న్యూస్ చానెల్స్ ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడును నేరుగా టార్గెట్ చేస్తూ కథనాలు ప్రచురించడం చర్చకు దారితీస్తోంది. అలిపిరిలో భక్తుల వసతి కోసం టౌన్‌షిప్ నిర్మాణం బోర్డు నిర్ణయం అయినప్పటికీ అది ఒక్క చైర్మన్ నిర్ణయమన్నట్లుగా చిత్రీకరించడం విమర్శలకు గురవుతోంది. శిల్పశాల అంశంలోనూ పూర్తి స్పష్టత తీసుకోకుండా అనుమానాల్ని రెచ్చగొట్టేలా కథనం రాయడం సమంజసం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
దీనిపై టీటీడీ ఇచ్చిన వివరణ ప్రకారం.. పేరూరు కంటే అలిపిరి ప్రాంతమే భక్తులకు అనుకూలమని బోర్డు నిర్ణయం తీసుకుంది. శిల్పశాలను తొలగిస్తారన్న ప్రచారానికి ఆధారం లేదని కూడా స్పష్టం చేసింది. గతంలో జరిగిన భూకేటాయింపుల అంశాలను సైతం ప్రస్తుత చైర్మన్‌కు అంటగట్టడం తప్పుడు ప్రచారమని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి.
చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాత విభేదాలను పక్కనపెట్టి అందరితో సమన్వయం పెంచుకున్నప్పటికీ, తాజాగా మళ్లీ వ్యక్తిగత ఈగోలు ముందుకు వస్తున్నాయన్న భావన కలుగుతోంది. ఈ పరిణామాలు చూస్తే బీఆర్ నాయుడు ఆర్కే మీడియా టార్గెట్ అయ్యారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాస్తవాల్ని నిర్ధారించి సమతుల్యంగా కథనాలు ఇవ్వాల్సిన బాధ్యత మీడియాపై ఉందన్నది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న మాట.


