ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. భారత పాస్‌పోర్ట్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేశాడని ఆరోపిస్తూ నటి కరాటే కళ్యాణి తీవ్రంగా స్పందించారు.
ఈ వ్యవహారంపై హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కరాటే కళ్యాణి అధికారికంగా ఫిర్యాదు చేశారు. దేశ గౌరవాన్ని కించపరిచేలా అన్వేష్ వ్యాఖ్యలు ఉన్నాయని, ఇది సహించదగ్గ విషయం కాదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత పాస్‌పోర్ట్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం దేశ ప్రతిష్టను దెబ్బతీసే చర్యగా పేర్కొన్నారు.
అంతేకాకుండా అన్వేష్‌కు ఉన్న పాస్‌పోర్ట్‌ను తక్షణమే రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ అంశంపై పాస్‌పోర్ట్ అథారిటీకి కూడా ఫిర్యాదు చేస్తామని, న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగుతుందని కరాటే కళ్యాణి స్పష్టం చేశారు.
సోషల్ మీడియా ద్వారా వెలువడిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. దేశ గౌరవానికి సంబంధించిన అంశాల్లో బాధ్యతగా వ్యవహరించాలని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

