ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సీఎం చంద్రబాబు బిచ్చగాళ్లపై పడ్డారు. ప్రతీ వారం కేంద్రంలో అప్పులు చేస్తూ అడుక్కుంటున్న చంద్రబాబు సర్కారు.. ఏపీలో మాత్రం ఆ అడుక్కునే వారే లేకుండా చేస్తోంది.
తాజాగా ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా భిక్షాటనపై నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ఎవ్వరూ బిచ్చగాళ్లకు నగదు లేదా వస్తువులు ఇవ్వకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో భిక్షాటన నియంత్రణ చర్యలు ప్రారంభమయ్యాయి.
ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడం, విదేశీ పెట్టుబడిదారుల ముందుకు ఒక సుస్థిర సామాజిక వాతావరణాన్ని చూపడం. నగరాలు, దేవస్థానాల వద్ద వ్యవస్థీకృతంగా భిక్షాటన జరుగుతోందనే ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిషేధాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
అలాగే, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పి4 (P4) కార్యక్రమం — ‘బంగారు కుటుంబాలు–మార్గదర్శులు’ ద్వారా పేదవారిని ఆర్థికంగా అభివృద్ధి చెందే దిశగా తీసుకెళ్లడమే లక్ష్యం. ఈ పథకం కింద బిచ్చగాళ్లను గుర్తించి వారికి రేషన్, వసతి, ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు సమాచారం.
భిక్షాటనకు అలవాటు పడినవారిని సమాజంలో తిరిగి స్థిరపడేలా చేయడం సవాలుగా మారినా, ఈ నిర్ణయం రాష్ట్రంలో పేదరిక నిర్మూలన దిశగా ఒక కీలక అడుగుగా భావించవచ్చు. అయితే చంద్రబాబు నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.

