ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరోసారి నిరాశకు గురయ్యారు. దసరా సందర్భంగా కనీసం ఒక డీఏ, ఐఆర్ ప్రకటిస్తారని ఆశించినా, కేబినెట్ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఆవేదన వ్యక్తమవుతోంది.
గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కె. వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరలేదని, పెండింగ్ బకాయిలు రూ.30 వేల కోట్లు దాటిపోయాయని విమర్శించారు. రెగ్యులర్‌గా ఇవ్వాల్సిన డీఏలు కూడా ఇవ్వకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్యోగుల పెండింగ్ బిల్లుల విషయంలో కూడా ఎటువంటి స్పష్టత చూపకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. పీఆర్‌సీ అమలు విషయాన్ని కూడా ఎన్నికల వరకు వాయిదా వేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
దసరాలోపు సానుకూల నిర్ణయం తీసుకోకపోతే పండగ తర్వాత ఉద్యమానికి సిద్ధమవుతామని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.