ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ పనితీరుపై కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 2025 నివేదిక రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల (యూటీ) పోలీసుల పనితీరుపై రూపొందించిన ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ 36వ స్థానంలో నిలిచి, జాబితాలో చిట్టచివరి స్థానాన్ని దక్కించుకుంది. దేశంలోనే అత్యంత అధ్వానంగా ఉన్న పోలీస్ వ్యవస్థగా ఏపీ పోలీస్ నిలిచింది.
నివేదిక ప్రకారం, 100 పాయింట్ల స్కేల్‌కు గాను ఆంధ్రప్రదేశ్ పోలీస్ కేవలం 16.70 పాయింట్స్ మాత్రమే సాధించింది. ఇది దేశంలోనే అత్యల్ప స్కోరు. ఈ దారుణమైన పతనం వెనుక రాజకీయ కక్ష్య సాధింపులు, ‘రెడ్ బుక్ ఎఫెక్ట్’ వంటి అంశాలు ప్రధాన కారణంగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
రాజకీయ ప్రత్యర్థులపై, ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడానికి, వేధించడానికి పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేయడాన్ని ఈ నివేదిక పరోక్షంగా సూచిస్తోంది. ‘రెడ్ బుక్’ తో అధికార పార్టీ తమ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకునేందుకు పోలీసులపై అనవసర ఒత్తిడి తెచ్చి, వ్యవస్థను రాజకీయ సాధనంగా మార్చారనే ఆరోపణలు ఉన్నాయి.
రాజకీయపరమైన కేసులపైనే దృష్టి పెట్టడం వలన, రాష్ట్రంలో సాధారణ శాంతి భద్రతల నిర్వహణ, నేరాల నియంత్రణ వంటి కీలక విధులను పోలీస్ శాఖ నిర్లక్ష్యం చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నివేదికలో ప్రస్తావించిన అంశాలు, ఏపీ పోలీస్ వ్యవస్థ రాజకీయ కక్ష్య సాధింపులతో దుర్వినియోగమైందన్న విమర్శలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన పోలీస్ వ్యవస్థ, కేవలం పాలకుల ఇష్టాయిష్టాల మేరకే నడుస్తోందన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దేశంలోనే అట్టడుగున నిలవడం అనేది ఏపీ పోలీస్ వ్యవస్థ ప్రొఫెషనలిజం, సమర్థతపై తీవ్ర ప్రశ్నలు వేస్తోంది.
ఈ నివేదిక నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ వ్యవస్థకు రాజకీయ జోక్యం లేకుండా స్వయం ప్రతిపత్తి కల్పించి, దాని పూర్వ వైభవాన్ని, ప్రజల్లో విశ్వాసాన్ని తిరిగి పెంచడానికి తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే, ఈ వ్యవస్థ మరింతగా పతనమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.


