విశాఖపట్నం, విజయవాడలో అత్యంత విలువైన ప్రభుత్వ స్థలాలను లూలూ గ్రూప్‌కు కట్టబెట్టడంపై వామపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. కమ్యూనిస్ట్ నాయకులు తమ నిరసనను వినూత్న రీతిలో వ్యక్తం చేశారు.
విశాఖలో, ఏపీ సీఎం చంద్రబాబు లూలూ, టీసీఎస్‌లకు కేటాయించిన స్థలాల వద్ద ఒక కమ్యూనిస్ట్ నేత డప్పు చేతపట్టి, తలకు ఎర్ర జెండా కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రూ.3,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఉచితంగా దోచిపెట్టడంపై పాట రూపంలో తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల్లో చర్చకు దారితీసింది.
ప్రభుత్వ భూముల అప్పగింతపై వామపక్షాల ఆందోళన
విశాఖపట్నంలోని సీతమ్మధారలో 13.59 ఎకరాలు, మధురవాడలో 1.5 ఎకరాల విలువైన స్థలాలను లూలూ గ్రూప్‌కు, టీసీఎస్‌కు ఇవ్వడాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్థలాలను లూలూ గ్రూప్‌కు ఇవ్వడానికి ప్రయత్నించగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అయితే ఇప్పుడు అదే నిర్ణయాన్ని తీసుకోవడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం నేత మధు తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ భూములను ఇలా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడం సరికాదని వారు డిమాండ్ చేశారు.