నందమూరి బాలకృష్ణ… తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని కథానాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎమ్మెల్యే. ఆయన ఇటీవల చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో హాస్యాన్ని పంచుతూ, నెటిజన్లకు ‘ట్రోలింగ్’కి కొత్త అంశాన్ని ఇచ్చింది.
టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రిని కలిసేందుకు సిద్ధమైన జాబితాలో తన పేరును 9వ నంబర్లో వేయడంపై బాలకృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా, తనను ఉద్దేశపూర్వకంగా అవమానించారని, 9వ నంబర్ అనేది సరైన స్థానం కాదని ఆయన కాసింత కోపంతో వ్యాఖ్యానించారు. ఒక సీనియర్ హీరోగా, ఎమ్మెల్యేగా తన స్థాయికి ఇది తగిన గౌరవం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
బాలకృష్ణ చేసిన ఈ ‘నంబర్ 9’ వ్యాఖ్యలపై ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్ , మీమ్స్ సునామీ నడుస్తోంది. ఏపీకి చెందిన కొంతమంది యువకులు, నెటిజన్లు బాలయ్యను ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు.
ముఖ్యంగా, “బుకింగ్ నంబర్ 9” అంటూ ఒక వీడియో రూపొందించారు. ఈ వీడియోలో, తమ పేర్లు లేదా బుకింగ్ నంబర్లు 9గా వస్తే తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటామని, ఆ టూర్లకు, ఈవెంట్లకు హాజరు కాబోమని.. తమ పేరే నంబర్ 1గా పెట్టాలంటూ సెటైర్లు వేస్తూ కామెడీ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సాధారణంగా నంబర్ 9 అనేది ఒక క్రమ సంఖ్య మాత్రమే. అయితే, బాలకృష్ణ దీనికి రాజకీయ కోణం అంటగట్టడంతో నెటిజన్లు దీనిని సరదాగా తీసుకుని, ప్రతి చిన్న విషయాన్ని కూడా 9వ నంబర్‌తో పోల్చుతూ జోకులు వేస్తున్నారు. ఫుడ్ డెలివరీ ఆర్డర్ మొదలుకుని, సినిమా టికెట్ల వరకు ప్రతిచోటా “బుకింగ్ నంబర్ 9″ని ప్రస్తావిస్తూ కామెడీ చేస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ‘నంబర్ 9’ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది, నెటిజన్లు రోజుకో కొత్త మీమ్ లేదా ట్రోల్‌తో బాలయ్యను సరదాగా ఆటపట్టిస్తున్నారు.