ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికైన మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు నిన్న శాసన మండలి చైర్మన్ కొయ్యె మోషేన్ రాజు సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు, పలువురు జనసేన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ప్రమాణ స్వీకారం అనంతరం నాగబాబు తన సతీమణితో కలిసి సీఎం చంద్రబాబు నాయుడిని కలిశారు. చంద్రబాబు ఆయనకు గౌరవ సత్కారం చేసి శుభాకాంక్షలు తెలిపారు. క్యాబినెట్ విస్తరణలో నాగబాబు మంత్రివర్గంలోకి చేరే అవకాశం ఉందన్న వార్తలున్నప్పటికీ, అసంతృప్తి రేకెత్తే అవకాశం ఉన్నందున కొన్ని రోజులు ఈ ప్రక్రియను వాయిదా వేశారని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు నాగబాబుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. “ఆంధ్ర ప్రదేశ్ విధాన పరిషత్ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన నా తమ్ముడు కొణిదెల నాగబాబుకి ఆత్మీయ అభినందనలు, ఆశీస్సులతో – నీ అన్నయ్య, వదిన” అంటూ చిరంజీవి ట్వీట్ చేయడంతో పాటు కొన్ని ఫోటోలు కూడా షేర్ చేశారు. నాగబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం కోసం చిరంజీవి ప్రత్యేకంగా ఒక పెన్ బహుమతిగా అందించగా, అదే పెన్‌తో నాగబాబు సంతకాలు చేశారు.
ఈ ట్వీట్‌కు నాగబాబు కూడా స్పందించారు. “ప్రియమైన అన్నయ్య, మీ ప్రేమాభిమానాలకు నేను ధన్యుడిని. మీరు, వదిన బహుకరించిన పెన్ నాకు ఎంతో ప్రత్యేకమైనది. ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఈ పెన్‌ను ఉపయోగించడం నాకు గౌరవంగా భావిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు.
అయితే నాగబాబు MLC పదవికి ఎంపిక కావడంపై టీడీపీ కార్యకర్తలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆయన టీడీపీపై చేసిన విమర్శలు, జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై వేసిన సెటైర్లు ఇందుకు కారణంగా భావిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ పదవి విషయంలోనే వ్యతిరేకత వ్యక్తమవుతుంటే, మంత్రివర్గంలో చేరితే ఇంకా ఎక్కువ వ్యతిరేకత ఎదుర్కొవాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.