తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు చర్చ అంతా సోషల్ మీడియా వార్ చుట్టూనే తిరుగుతోంది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్ తర్వాత, బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం పనితీరు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. దీనిపై ప్రముఖ జర్నలిస్ట్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యాంకర్ వెంకటకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రత్యర్థులకు అందనంత స్పీడులో ‘గులాబీ’ సైన్యం
కేసీఆర్ ప్రెస్ మీట్ జరుగుతుండగానే, బీఆర్ఎస్ సోషల్ మీడియా టీమ్ అత్యంత చురుగ్గా వ్యవహరించింది. కేసీఆర్ ప్రసంగంలోని కీలక అంశాల చూస్తే..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన విమర్శలు… చంద్రబాబు నాయుడు మరియు కాంగ్రెస్ ప్రభుత్వంపై గుప్పించిన అస్త్రాలు… ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన పదునైన మాటలు…
వీటన్నింటినీ ఎక్కడికక్కడ చిన్న చిన్న వీడియో క్లిప్పులుగా (బిట్స్) కట్ చేసి, నిమిషాల వ్యవధిలోనే నెట్టింట వైరల్ చేశారు. ప్రత్యర్థులు కోలుకోకముందే సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా ‘ఫుల్లీ లోడెడ్’ గా ఉందంటూ విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ ఇంత దూకుడుగా వెళ్తుంటే, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కనీసం కౌంటర్ ఇవ్వలేకపోవడంపై వెంకటకృష్ణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన తన విశ్లేషణలో కొన్ని కీలక ప్రశ్నలు లేవనెత్తారు:
“అసలు కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా విభాగం ఉందా? పని చేస్తోందా? ప్రతిపక్షం విమర్శలు గుప్పిస్తుంటే అధికార పార్టీ నేతలు, వారి సోషల్ మీడియా టీమ్ ఏం చేస్తోంది? అందరూ మొద్దునిద్ర పోతున్నారా?”
బీఆర్ఎస్ స్పీడుకు కాంగ్రెస్ బేజార్ అవుతోందని, సరైన సమయంలో స్పందించకపోవడం వల్ల సోషల్ మీడియాలో మైలేజ్ మొత్తం ప్రతిపక్షానికే వెళ్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
రాజకీయాల్లో ఇప్పుడు క్షేత్రస్థాయి పోరాటం కంటే సోషల్ మీడియా పోరాటమే గెలుపోటములను ప్రభావితం చేస్తోంది. ఈ విషయంలో బీఆర్ఎస్ తన పట్టును నిరూపించుకోగా, కాంగ్రెస్ మాత్రం ఆశించిన స్థాయిలో స్పందించలేకపోతోందనేది తాజా పరిణామాలను చూస్తుంటే అర్థమవుతోంది. మరి ఈ విమర్శల తర్వాతైనా కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్ మేల్కొంటుందో లేదో చూడాలి.

