ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన పార్టీ ఎమ్మెల్యేలపై సీరియస్ అయినట్టు సమాచారం. తాజాగా ఓ 48 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వారికి హెచ్చరికలు జారీ చేసినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు 2024 ఎన్నికల తర్వాత కూడా పార్టీ నియంత్రణలో కఠినంగా వ్యవహరిస్తున్నారని తెలిసిందే. ప్రజల సమస్యలు పట్టించుకోకపోవడం, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ వంటి అంశాల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన ఎమ్మెల్యేలపై సీఎంవోకు పలు ఫిర్యాదులు చేరినట్టు తెలుస్తోంది.
దీంతో చంద్రబాబు నేరుగా స్పందించి, “మీరే మారతారా? లేక మార్చేయమంటారా?” అంటూ సూటిగా హెచ్చరించినట్టు సమాచారం. అంతేకాక, ప్రజలతో మమేకం కావడం, ప్రజాదర్బార్లు నిర్వహించడం వంటి అంశాల్లో కూడా ఎమ్మెల్యేల వైఫల్యంపై ఆయన అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
లోకేష్ కూడా ఇటీవలే ఎమ్మెల్యేల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో, ఇప్పుడు చంద్రబాబు చర్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. పార్టీ అధినేత సీరియస్ వార్నింగ్ తర్వాత, తీరుతెన్నులు మార్చకపోతే ఈ ఎమ్మెల్యేల భవిష్యత్తు ప్రశ్నార్థకమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


