దీపావళి పండగను ముందు పెట్టుకుని ప్రభుత్వ ఉద్యోగులు పండగ వాతావరణంలో ఉండాలని అనుకున్నా.. చంద్రబాబు ప్రభుత్వం వారిని తీవ్ర నిరాశకు గురి చేసింది. “ఉద్యోగుల కోసం మేమున్నాం.. సంక్షేమమే మా లక్ష్యం” అని ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం పూర్తిగా తలకిందులు చేశారు.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నా ప్రభుత్వం ఒక్క డీఏ మాత్రమే ప్రకటించింది. “ఇదే పండగ బహుమతి అనుకోండి” అని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఉద్యోగుల్లో ఆగ్రహం రేపుతున్నాయి. పచ్చ మీడియా దానిని “మంచి నిర్ణయం” అంటూ ప్రశంసించడమే మరింత అసహనాన్ని కలిగిస్తోంది.
అంతేకాదు, పీఆర్సీ అమలుపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇంటరిమ్ రిలీఫ్ (IR) గురించి కూడా నోరు విప్పలేదు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఇప్పుడు కేవలం మాటలకే పరిమితమయ్యాయి.
ఇక సచివాలయ ఉద్యోగులు, ప్రభుత్వంలో విలీనం చేసిన RTC ఉద్యోగులపై కూడా భారం వ్యాఖ్యలు చేసి చంద్రబాబు మరోసారి వివాదానికి కారణమయ్యారు. “ప్రభుత్వానికి భారమయ్యారు” అని సీఎం చెప్పిన మాటలు ప్రభుత్వ సిబ్బందికి అవమానకరంగా అనిపిస్తున్నాయి.
ఉద్యోగ సంఘాలు ఇప్పుడు ఆగ్రహంతో ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. “మా హక్కులు అడిగితే భారం అంటారా?” అంటూ చంద్రబాబుపై మండిపడుతున్నాయి. ఒకవైపు పండగ వాతావరణం, మరోవైపు నిరాశ.. ఈ రెండు మధ్యలో ప్రభుత్వ ఉద్యోగులు బలైపోతున్నారు.
ప్రజలతో పాటు ఇప్పుడు ఉద్యోగులూ చంద్రబాబు “మోసం”ను గట్టిగా అనుభవిస్తున్నారు.