ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనా యంత్రాంగంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న ఆయన, కలెక్టర్ల సదస్సు వేదికగా అధికారులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. “మనం బాగా చేస్తున్నామని మనం అనుకుంటున్నాం.. కానీ ప్రజలు మాత్రం మన పాలనను మెచ్చడం లేదు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధికార వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.
సదస్సులో అధికారుల పనితీరును సమీక్షించిన సీఎం, గణాంకాల కంటే ప్రజల సంతృప్తి ముఖ్యమని స్పష్టం చేశారు. “మీరు ఫైళ్లు క్లియర్ చేస్తున్నామని, అద్భుతంగా పని చేస్తున్నామని మీరు అనుకుంటున్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీ అందుకు భిన్నంగా ఉంది. మనం ఎవరి కోసం అయితే పని చేస్తున్నామో, ఆ ప్రజల నుండే వ్యతిరేకత వస్తోంది. ఇదీ అసలైన రియలైజేషన్” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ యంత్రాంగం పడుతున్న కష్టానికి, వస్తున్న ఫలితానికి ఎక్కడా పొంతన లేదని ముఖ్యమంత్రి మండిపడ్డారు.”పని చేస్తున్నామని చెప్పుకోవడం కాదు, ఆ పని వల్ల సామాన్యుడికి కలిగిన లబ్ధి ఏంటి? ఎండ్ అవుట్‌కమ్ (End Outcome) రానప్పుడు మీరు పడే కష్టానికి అర్థం లేదు” అని అధికారులను నిలదీశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు ప్రజల్లోకి సరైన రీతిలో వెళ్లడం లేదని, పరిపాలనపై జనంలో ఒక రకమైన విముఖత కనిపిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లా స్థాయి అధికారులైన కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని సీఎం ఆదేశించారు. “మీరు మారాలి, మీ పనితీరులో మార్పు రావాలి. ప్రజలకు పాలన చేరువైనప్పుడే మనకు గుర్తింపు వస్తుంది. ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించి, ప్రజల మెప్పు పొందేలా పని చేయండి” అని హితవు పలికారు.
చంద్రబాబు నాయుడు వంటి అనుభవజ్ఞుడైన నాయకుడు బహిరంగంగానే “నా పాలన నచ్చడం లేదు” అని ఒప్పుకోవడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారుల్లో ఉన్న అలసత్వాన్ని వదిలించి, వారిని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా సీఎం ఈ ‘షాక్ ట్రీట్‌మెంట్’ ఇచ్చినట్లు కనిపిస్తోంది.
https://x.com/greatandhranews/status/2001179018390085669?s=20


