ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి వస్తున్న ప్రశ్నలకు సరైన లాజికల్ సమాధానాలు ఇవ్వలేని పరిస్థితిలో దూషణలు.. నిందలతో ఎదురుదాడికి దిగుతున్నారనే విమర్శలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేవనెత్తిన పీపీపీ మెడికల్ కాలేజీల అంశాన్ని పక్కదారి పట్టించేందుకు ఎయిర్‌పోర్టులతో పోల్చడం ప్రజల్లో అయోమయం కలిగిస్తోంది.
పేదల ప్రాణాలతో ముడిపడి ఉన్న మెడికల్ కాలేజీలను.. ప్రధానంగా సంపన్నులకు ఉపయోగపడే ఎయిర్‌పోర్టులతో ఒకే గాటన కట్టడం ఎంతవరకు సమంజసం? అన్న ప్రశ్న సామాన్యుల నుంచి వినిపిస్తోంది. జగన్ హయాంలో ప్రభుత్వ రంగంలో ప్రారంభమైన మెడికల్ కాలేజీలు పూర్తి కాకపోవడాన్ని వైఫల్యంగా ముద్ర వేయడం కంటే.. వాటిని కొనసాగించి పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించడం ప్రభుత్వ బాధ్యత కాదా అనే చర్చ మొదలైంది.
అమరావతి విషయంలో జగన్ చేసిన రాజకీయ పొరపాట్లను చంద్రబాబు అస్త్రాలుగా వాడుకోవడం సహజమే. కానీ అదే సమయంలో పేదల వైద్య అవసరాలపై సహేతుకంగా వచ్చిన విమర్శలకు సమాధానం చెప్పకుండా పోలికలతో తప్పించుకోవడం మాత్రం సబబుగా లేదన్న అభిప్రాయం బలపడుతోంది.

