ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మరోసారి పీఆర్ స్టంట్‌తో అడ్డంగా దొరికిపోయారని వైసీపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. తాజాగా పారిశుధ్య కార్మికులతో జరిగిన ఘటన పూర్తిగా ముందే ప్లాన్ చేసిన స్క్రిప్ట్‌లా కనిపిస్తోందని, ఇది సహజ సంఘటన కాదని వారు ఆరోపిస్తున్నారు.
కాన్వాయ్‌తో వెళ్తున్న చంద్రబాబు అకస్మాత్తుగా చెత్తబండి దగ్గర ఆగి కార్మికులతో మాట్లాడినట్టుగా, వారి సమస్యలు పరిష్కరించినట్టుగా చూపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, ఇలాంటి సందర్భాల్లో సాధారణంగా పోలీసులు ట్రాఫిక్‌ను పూర్తిగా నియంత్రిస్తారని, సీఎం కాన్వాయ్ ముందు చెత్తబండిని అనుమతించడం అసాధ్యమని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.
ఇంకా ఈ ‘సీన్’ మొత్తం కెమెరాలతో చుట్టుముట్టి, మైక్‌లు సిద్ధంగా ఉంచుకుని తీసినట్టుగా స్పష్టంగా కనిపిస్తోందని వైసీపీ నేతలు అంటున్నారు. ఇది పబ్లిక్ సెంటిమెంట్‌ను ఆకట్టుకునేలా రూపొందించిన పీఆర్ డ్రామా తప్ప మరేమీ కాదని, మీడియా హైప్ కోసం చేసిన ప్రయత్నమేనని వారు వ్యాఖ్యానించారు.
సహజంగా జరిగితేనే ప్రజలకు నమ్మకం కలుగుతుందని, ముందే రాసిన స్క్రిప్ట్‌తో చేసే స్టంట్లు బట్టబయలవుతాయని విమర్శలు వినిపిస్తున్నాయి. తొలి షాట్‌లోనే అసలు ఉద్దేశం బయటపడిందని, ‘సీన్ నేచురల్‌గా రావాలి కదయ్యా’ అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.


