ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పాలన శైలిని మార్చుకున్నారా? ప్రజల్లో మరింతగా మమేకమవుతూ వారి సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్నారా? ఇటీవల ఆయన చేపడుతున్న చర్యలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యంగా అంబేద్కర్ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లాలో ఆయన పర్యటన అనేకమందిని ఆశ్చర్యానికి గురిచేసింది. పొన్నెకల్లు గ్రామంలోని ఎస్సీ కాలనీలో పర్యటిస్తున్న సమయంలో ఒక దళిత కుటుంబ పరిస్థితిని చూసి ఆయన చలించిపోయారు.
ఆ కుటుంబానికి చెందిన ప్రవీణ్ అనే యువకుడు సొంతంగా బైక్ రిపేర్ షాప్ నడుపుతున్నాడు. అతని ఇంటికి స్వయంగా వెళ్లిన చంద్రబాబు అతని కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సరైన పనిముట్లు కూడా లేని ఆ యువకుడు మెకానిక్ పని ఎలా చేస్తున్నాడని ఆరా తీశారు. వెంటనే ఆ కుటుంబానికి ఊహించని విధంగా వరాల జల్లు కురిపించారు. ప్రవీణ్ కు మంచి శిక్షణ ఇప్పించి, అత్యాధునిక వసతులతో గ్యారేజ్ ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు, ఆ కుటుంబానికి ఒక ఇల్లు కూడా మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మంచి స్థలంలో షాప్ ఏర్పాటు చేసి, అవసరమైన టూల్స్ కూడా అందించాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తమ ఇంటికి వచ్చి తమ కష్టాలు తెలుసుకొని సహాయం చేస్తారని కలలో కూడా ఊహించలేదని ప్రవీణ్ కుమార్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.
చంద్రబాబు గతంలో కంటే ఇప్పుడు ప్రజలతో మరింతగా మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో లబ్ధిదారులతో నేరుగా మాట్లాడుతున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీలో భాగంగా ఒక పేద ఇంటికి వెళ్లి స్వయంగా టీ తయారు చేసి అందరికీ అందించారు. ప్రతి నెల ఒక జిల్లాలో పర్యటిస్తూ లబ్ధిదారులతో పాటు సాధారణ ప్రజలను కూడా కలుస్తూ వారితో ముచ్చటిస్తున్నారు. చంద్రబాబులో ఇంతటి మార్పు గతంలో ఎప్పుడూ చూడలేదని అధికారిక వర్గాలు సైతం చెబుతున్నాయి.
ఇటీవల బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా చంద్రబాబు ఒక బార్బర్ షాప్ కు వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు. అక్కడ పనిచేస్తున్న వ్యక్తిని అతని ఆదాయం, ప్రభుత్వ సహాయం గురించి అడిగి తెలుసుకున్నారు. అయితే ప్రభుత్వ పథకాలు తమకు అందడం లేదని ఆ పేదలు చెప్పడంతో చంద్రబాబుతో పాటు ప్రభుత్వ యంత్రాంగం కూడా ఒక్కసారిగా షాక్ కు గురైంది. అధికారులు సరిగ్గా పనిచేయడం లేదని అర్థం చేసుకున్న చంద్రబాబు వెంటనే పలు రకాల ప్రభుత్వ సహాయాలను ప్రకటించారు.
అయితే, సోషల్ మీడియాలో మాత్రం పేదలకు పథకాలు అందించలేని బాబు ప్రభుత్వం అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కానీ, ఒక దళిత యువకుడి ఇంటికి స్వయంగా వెళ్లి అతని కష్టాలను తెలుసుకొని, పథకాలు అందడం లేదని నిర్ధారించుకుని వెంటనే సహాయం అందించడానికి ముందుకు రావడం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మొత్తానికి చంద్రబాబు తన పంథాను మార్చుకొని ప్రజల్లోకి మరింతగా చొచ్చుకుపోతూ వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి.