ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న DSC-2025 నియామకాలు తీవ్రమైన వివాదాలకు దారితీస్తున్నాయి. కష్టపడి పరీక్షలు రాసిన అభ్యర్థులు న్యాయం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా మెరిట్ లిస్ట్ ప్రకటించి, అర్హులను సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు పిలవడం ఆనవాయితీ. కానీ ఈసారి ప్రభుత్వం మెరిట్ లిస్ట్‌ను ప్రకటించకుండానే కొందరికి కాల్ లెటర్లు జారీ చేసింది. 85 మార్కులకుపైగా సాధించిన అభ్యర్థులు పక్కన పడిపోగా, కేవలం 37 మార్కులు తెచ్చుకున్న వారికీ ఉద్యోగాలు దక్కినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ పరిణామాలపై అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియాలో తమ వేదనను పంచుకుంటున్నారు. విద్యార్థి సంఘాలు కూడా ప్రభుత్వంపై విరుచుకుపడుతూ, వెంటనే పూర్తి మెరిట్ లిస్ట్‌ను పారదర్శకంగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఉద్యోగం అనేది నిరుద్యోగుల కల. ఆ కలను సాకారం చేసాల్సిన DSC ప్రక్రియ అవినీతి ఆరోపణలతో కమ్ముకుపోవడం ప్రభుత్వ విశ్వసనీయతకు పెద్ద సవాల్‌గా మారింది. సమయానికి స్పందించకపోతే ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉంది.