శ్రీకాకుళం జిల్లా నేత దువ్వాడ శ్రీనివాస్ చుట్టూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఒకప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్న ఆయన, వ్యక్తిగత వ్యవహారాల కారణంగా పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అనైతిక బంధం ఆరోపణలు, కుటుంబంలో కలహాలు, రాజకీయ విఫలతలు.. ఇలా వరుస సంఘటనలు ఆయనపై నెగిటివ్ ఇమేజ్‌ను పెంచాయి.
అయితే, తాజాగా దువ్వాడ వైఖరిలో మార్పు కనబడుతోంది. పవన్ కళ్యాణ్‌పై ప్రశంసలు, చిరంజీవి పట్ల అభిమాన ప్రదర్శన, లోకేష్‌పై సానుకూల వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆయన ప్రజలలో, ముఖ్యంగా టిడిపి–జనసేన వర్గాలలో కొంత సానుకూలతను సంపాదించారు.
ఇక ఇటీవల ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వివాదంలో దువ్వాడ జోక్యం చేసి, కింజరాపు–ధర్మాన కుటుంబాలపై కుట్ర ఆరోపణలు చేయడం సంచలనం రేపింది. కాలింగ కులం పునరేకీకరణ పేరుతో ఈ రెండు కుటుంబాలపై టార్గెట్ పెట్టినట్లు స్పష్టమైంది.
దీంతో, దువ్వాడ శ్రీనివాస్ రాజకీయాల్లో మళ్లీ చురుకుగా మారే ప్రయత్నం చేస్తూ, తనపై ఉన్న ప్రతికూలతను తగ్గించుకోవడంలో కొంతవరకు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు.