దువ్వాడ శ్రీనివాస్ అనుచరుడు కింజరాపు అప్పన్న, మాధురి మధ్య జరిగిన సంభాషణ ఈ ఆడియోలో ఉంది. శ్రీనివాస్‌పై దాడి చేసేందుకు ప్లాన్ జరుగుతోందని అప్పన్న ఆ ఆడియోలో హెచ్చరించారు. ముఖ్యంగా నరసన్నపేట లేదా నిమ్మాడ జంక్షన్ ప్రాంతాల్లో ఈ దాడి జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొనడం సంచలనంగా మారింది.
ఈ హెచ్చరికలపై దువ్వాడ శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. అర్ధరాత్రి సమయంలో నిమ్మాడ హైవేపైకి చేరుకున్న ఆయన, అక్కడ హల్‌చల్ చేశారు. “దమ్ముంటే వచ్చి కొట్టండి, ఇలాంటి బెదిరింపులకు నేను భయపడను” అంటూ బహిరంగ సవాల్ విసిరారు. అవినీతిని ప్రశ్నిస్తే చంపేస్తారా అని ఆయన నిలదీశారు.
ఇదే క్రమంలో తన రాజకీయ స్థితిగతులపై కూడా దువ్వాడ స్పందించారు. ఇప్పటికే తనను వైసీపీ నుంచి సస్పెండ్ చేశారని గుర్తు చేస్తూ, అవసరమైతే బహిష్కరించుకోవచ్చని తేల్చి చెప్పారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తాను తగ్గేదే లేదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఈ ఆడియో క్లిప్ , దువ్వాడ చేసిన సవాల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


