ప్రజాప్రతినిధులు సమాజానికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. ఇటీవల ఏబీఎన్ ఛానెల్ నిర్వహించిన ఒక ప్రత్యక్ష చర్చా కార్యక్రమంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రవర్తన తీవ్ర చర్చనీయాంశమైంది.
టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న మల్లయ్య యాదవ్, లైవ్ సాగుతుండగానే మద్యం సేవిస్తూ కనిపించడం అందరినీ షాక్‌కు గురిచేసింది. గ్లాసులో మద్యం పోసుకుని తాగుతూనే, ఎమ్మెల్సీ కవితపై ఇతర రాజకీయ అంశాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. డిబేట్‌లో తన వాదన వినిపిస్తూనే ‘మందు’ కొట్టడం కెమెరాకు స్పష్టంగా చిక్కడంతో ఆ వీడియో క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియోపై మహిళా సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి, టీవీ వేదికగా మద్యం తాగుతూ ఒక మహిళా నాయకురాలిని విమర్శించడం సంస్కారహీనమని వారు ధ్వజమెత్తుతున్నారు. మల్లయ్య యాదవ్ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవ్వడంతో మల్లయ్య యాదవ్ సొంత పార్టీ కూడా ఇరకాటంలో పడింది. ప్రత్యర్థి పార్టీల నాయకులు ఈ అంశాన్ని అస్త్రంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక మాజీ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఇలాంటి పనులకు పాల్పడటం వల్ల రాజకీయ వ్యవస్థపైనే ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


