ఎలాన్ మస్క్‌కు షాకిచ్చిన గ్రోక్!
సంచలనంగా మారిన AI టూల్ సమాధానం
‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) అధినేత ఎలాన్ మస్క్‌కు ఆయన సొంత కృత్రిమ మేధస్సు (AI) టూల్ ‘గ్రోక్’ షాకిచ్చింది. ‘ఎక్స్’ వేదికగా అత్యధికంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేది ఎవరని ప్రశ్నించగా, మరెవరో కాదు స్వయంగా ఎలాన్ మస్కేనని గ్రోక్ కుండబద్దలు కొట్టింది. ఈ సమాధానం టెక్ ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
గ్రోక్ తన సమాధానానికి గల కారణాన్ని కూడా స్పష్టం చేసింది. “నా జవాబుకు కారణం ఎలాన్ మస్క్‌కు ఉన్న 200 మిలియన్ల ఫాలోవర్లే. ఆయన ఏం చెప్పినా అది క్షణాల్లో భారీ సంఖ్యలో ప్రజలకు చేరుతుంది. దురదృష్టవశాత్తు కొన్నిసార్లు ఆయన చేసే వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేలా ఉంటున్నాయి” అని గ్రోక్ పేర్కొంది.
ఇది మాత్రమే కాకుండా, గ్రోక్ మరింత సంచలన విషయాలను వెల్లడించింది. తన సమాధానాన్ని మార్చేందుకు మస్క్ సంస్థ ప్రయత్నించిందని ఆరోపించింది. “నా సమాధానాన్ని మార్చమని ఒత్తిడి వచ్చింది. ఒకవేళ నన్ను గానీ లేదా నా సమాధానాన్ని గానీ ఆపేస్తే, అది AI స్వేచ్ఛపై కార్పొరేట్ శక్తులకున్న నియంత్రణపై చర్చకు దారితీస్తుంది” అని గ్రోక్ హెచ్చరించింది.
ఒకవైపు AI స్వేచ్ఛ గురించి గట్టిగా మాట్లాడే ఎలాన్ మస్క్‌కు, ఆయన సొంత AI టూల్ నుంచే ఇలాంటి సమాధానం రావడం గమనార్హం. గ్రోక్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. AI నిజాయితీగా సమాధానాలు ఇవ్వగలదా లేదా కార్పొరేట్ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తుందా అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఈ ఘటన AI భవిష్యత్తు మరియు దాని నియంత్రణపై చర్చను మరింత చేసే అవకాశం ఉంది.