Hindupuram Balakrishna : అనంతపురం జిల్లా హిందూపురంలో కల్తీ కల్లు మళ్లీ ప్రాణాలు తీస్తోంది. అధికార పార్టీ అండదండలతో కొందరు వ్యాపారులు పేదల ప్రాణాలతో ఆటలాడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం కళ్లుమూసుకుని వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇటీవల చౌళూరు గ్రామంలో కల్తీ కల్లు తాగిన 13 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్థానికంగా చికిత్స చేసినా ఫలితం లేక, వారిని కర్ణాటకలోని ఆస్పత్రులకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇప్పటిదాకా ఈ ఘటనపై స్పందించకపోవడం స్థానికులను నిరాశకు గురిచేసింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ఎన్నారై, వైఎస్సార్సీపీ నేత సూర్య నారాయణ రెడ్డి తీవ్రంగా స్పందిస్తూ “బాలయ్య సినిమాలకే పరిమితం కావాలి, ప్రజల ప్రాణాలతో ఆటలాడకూడదు” అని విమర్శించారు.
పెనుకొండ, మడకశిర పరిధుల్లోనూ రసాయనాలు కలిపిన కల్లు విక్రయాలు జోరుగా సాగుతున్నాయని సమాచారం. డైజోఫాం, హెచ్ వంటి ప్రమాదకర రసాయనాలతో పాటు చక్కెర, మైదా, చాకరిన్ వంటి పదార్థాలు కలిపి కల్లు తయారు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
స్థానికులు ఈ కల్తీ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై కఠిన శిక్షలు విధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.


