వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావుపై సీఎం జగన్ కఠినంగా వ్యవహరించినట్లు సమాచారం. పార్టీలో కొనసాగుతున్నా, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ సైలెంట్‌గా వ్యవహరిస్తున్న ధర్మానపై జగన్ విసుగుపడ్డారని అంటున్నారు. “ఉంటే ఉండు.. లేకుంటే వెళ్లిపో” అని స్పష్టం చేసినట్లు ప్రచారం సాగుతోంది.
ధర్మాన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్‌తో మొదలై, వైసీపీలో కొనసాగుతున్నా ఆయన వైఖరి ఎప్పుడూ అనుమానాస్పదంగానే ఉందని విశ్లేషకుల అభిప్రాయం. 2019లో గెలిచినా మంత్రి పదవి రాకపోవడంతోనే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారని చెబుతున్నారు. తాజాగా 2024లో భారీ ఓటమి తర్వాత మరింత సైలెంట్ అయ్యారు.
అదే సమయంలో ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ మాత్రం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చురుకుగా వ్యవహరిస్తున్నారు. కానీ ధర్మాన ప్రసాదరావు నుంచి ఆశించిన సహకారం లేకపోవడంతో జగన్ ఈసారి తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ ధర్మాన బయటకు వెళితే శ్రీకాకుళం రాజకీయాల్లో కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది