ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాలు, సరఫరా విధానాలపై గత కొంతకాలంగా అనేక వివాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కృష్ణా జిల్లాలోని పెడన నియోజకవర్గం నుంచి వెలుగుచూసిన ఒక విషయం తీవ్ర కలకలం రేపుతోంది. కొందరు వ్యాపారులు ఏకంగా ఇంటింటికి మద్యం డెలివరీ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సరిహద్దు రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తీసుకురావడం, లేదా అధికారిక మద్యం దుకాణాల నుంచి కొనుగోలు చేసిన మద్యాన్ని అధిక ధరలకు రహస్యంగా సరఫరా చేయడం వంటివి గతంలో చూశాం. అయితే ఇప్పుడు వినిపిస్తున్న ఆరోపణలు మరింత తీవ్రమైనవి.
లేబుల్ లేని మద్యం.. కల్తీ అనుమానాలు
స్థానిక వర్గాల సమాచారం ప్రకారం.. పెడన నియోజకవర్గంలో జరుగుతున్న ఈ సరఫరాలో వినియోగిస్తున్న మద్యం బాటిళ్ళపై లేబుళ్లు లేకపోవడం గమనార్హం. దీనితోపాటు, అసలు ఇది అధికారికంగా అమ్మకానికి అనుమతి పొందిన మందు అవునా? కాదా? అనే కల్తీ మద్యం అనుమానాలు ప్రజల్లో బలపడుతున్నాయి.
“ఇంటి వద్దకే మద్యం సరఫరా” పేరుతో జరుగుతున్న ఈ అక్రమ వ్యాపారం చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా, ప్రజల ఆరోగ్యానికి కూడా హానికరంగా మారే ప్రమాదం ఉంది. లేబుల్ లేని మద్యం అసలు నాణ్యత ఏంటనేది అంతుచిక్కడం లేదు.
ఇంత బహిరంగంగా, ఇంటింటికి మద్యం సరఫరా జరుగుతున్నా, దీనిని అరికట్టడంలో అధికార యంత్రాంగం పట్టిపట్టనట్లుగా వ్యవహరిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్సైజ్ శాఖ, పోలీసు అధికారులు ఈ అక్రమ వ్యాపారంపై ఎందుకు దృష్టి సారించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
కల్తీ మద్యం, అక్రమ సరఫరా వంటి అంశాలు ప్రజారోగ్యం, ప్రభుత్వ ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కాబట్టి, సంబంధిత అధికారులు వెంటనే ఈ వ్యవహారంపై దృష్టి సారించి, అక్రమాలకు పాల్పడుతున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
https://x.com/greatandhranews/status/1996460405590499829?s=20


