వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత నేతల్లో కొందరు పార్టీని వీడగా, మరికొందరు మౌనం వహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
ధర్మాన, కింజరాపు కుటుంబాలపై నేరుగా ఆరోపణలు చేస్తూ దువ్వాడ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి విధేయుడునేనని, త్వరలోనే మళ్లీ పార్టీలోకి వస్తానని బహిరంగంగానే ప్రకటించారు. అంతేకాదు, పార్టీ నుంచి బహిష్కరించాలంటే చేసేయమని సవాల్ విసరడం ఆయనకు జగన్ వర్గం వెన్నుదన్నుగా ఉందన్న అనుమానాలకు బలమిస్తోంది.
రాజకీయ జీవితంలో దూకుడే ఆయుధంగా మారిన దువ్వాడ, ఇప్పుడు ప్రత్యక్షంగా ధర్మాన సోదరులను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా ధర్మాన–కింజరాపు కుటుంబాల ‘సెట్టింగ్’ గురించి ఆరోపణలు చేసి, తానే సామాజిక వర్గ బలం వెనకబెట్టుకున్నానని సంకేతాలు ఇస్తున్నారు.
ఇకపోతే, పార్టీ లోపల కూడా ధర్మాన సోదరులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టిడిపితో అవగాహన ఉందని జగన్ భావిస్తున్నారని సమాచారం. అందుకే ప్రత్యామ్నాయంగా దువ్వాడ శ్రీనివాస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. త్వరలో ఆయనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేసి, శ్రీకాకుళం జిల్లా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.
అంతిమంగా, దువ్వాడపై జగన్ ఆశలు పెట్టుకున్నారా? లేక ఇది కేవలం రాజకీయ మైండ్‌గేమ్ మాత్రమేనా? అన్నది చూడాలి.