వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక మలుపు వద్ద నిలిచినట్టు కనిపిస్తోంది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు తాడేపల్లిలో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు, ఆందోళన కార్యక్రమాలు, ప్రజల్లోకి వెళ్లే వ్యూహం, జిల్లాల పర్యటనలపై ఆయన స్పష్టత ఇవ్వనున్నట్టు సమాచారం.
ఇటీవల యూరియా కొరత, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి అంశాలపై ప్రభుత్వం ఎదుర్కొన్న విమర్శల దృష్ట్యా, ఇకపై పార్టీ బలమైన పోరాటానికి సిద్ధమవుతోందని చెబుతున్నారు. ఈసారి జరిగే ఆందోళనల్లో జగన్ స్వయంగా పాల్గొనాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
అలాగే నెలల తరబడి వాయిదా పడుతున్న జిల్లాల పర్యటనపై కూడా ఆయన ఫుల్ క్లారిటీ ఇవ్వనున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు అసెంబ్లీ హాజరు, ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశాలపై కూడా చర్చ జరుగనుంది. మొత్తం మీద జగన్ ఈరోజు తీసుకునే నిర్ణయాలు పార్టీ భవిష్యత్ వ్యూహాన్ని నిర్ణయించనున్నాయి.