వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన కేడర్ ఉందనేది కాదనలేని సత్యం. ఇప్పటికీ ఆ పార్టీని విపరీతంగా అభిమానించే వారు చాలా మంది ఉన్నారు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఎక్కువగా ఆరాధిస్తుంటారు. దీనికి ప్రధాన కారణం ఆయన వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు కావడమే కాకుండా, గత ఐదు సంవత్సరాలుగా సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడమే. అయితే, అభివృద్ధిని కోరుకున్న వారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకులుగా మారగా, సంక్షేమ పథకాలను ఆశించిన వారు ఆయనకు భక్తులుగా మారిపోయారు.
ఈ భక్తి ఎంత స్థాయికి చేరిందంటే, జగన్మోహన్ రెడ్డిని ఓడించిన వారిని దూషించే స్థాయికి చేరుకుంది. కేవలం నాయకులే కాదు, సామాన్యులు సైతం తిట్ల దండకం అందుకుంటున్నారు. ఇటీవల, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక జగన్ అభిమాని చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
శ్రీకాకుళం మాండలికంలో, కాస్త విభిన్నంగా కనిపించే ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలు నవ్వు పుట్టిస్తున్నాయి. జగన్ అన్నీ చేశాడని, కానీ ప్రజలు మాత్రం ఆయనను నమ్మలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ వ్యక్తి చేసిన కామెంట్లు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. “జగన్ అన్నీ చేస్తే మీరేం చేశారు?” అంటూ ఆ వీధిలోని వారిని ఆయన ప్రశ్నిస్తున్న తీరు ఆకట్టుకుంది, ఆలోచింపజేసింది. దానికి కామెడీని జోడిస్తూ, తన హావభావాలతో రక్తి కట్టిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు, అది క్షణాల్లో వైరల్ అయ్యింది.
సదరు వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి వీరాభిమానిగా స్పష్టంగా కనిపిస్తున్నాడు. ఒక వీడియోలో ఒక మహిళ జగన్ ఏం చేశాడు? ఏం చేయలేదు అని అనగానే, ఆ వ్యక్తి తీవ్రంగా స్పందించాడు. “వాలంటీర్లు తినేశారు, ఉద్యోగులు తినేశారు, జగన్ ఇచ్చిన పథకాలను తినేశారు, కానీ ఓట్లు మాత్రం వేయలేదు” అంటూ ఆ వ్యక్తి నిష్ఠూరంగా, శ్రీకాకుళం మాండలికంలో దీర్ఘాలు పలుకుతూ చేసిన వ్యాఖ్యలు తెగ నవ్వు పుట్టించాయి. అన్నింటికీ మించి, జగన్‌పై ఆయనకు ఉన్న అపారమైన అభిమానాన్ని చాటిచెప్పాయి.