తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ లీడర్‌గా పేరొందిన బీజేపీ నేత, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కారు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా రెండుసార్లు గెలుపొందిన ఆయన, వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతుంటారు.
తాజాగా జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న బండి సంజయ్, ఆర్‌ఎస్‌ఎస్‌లో పనిచేసిన రోజుల జ్ఞాపకాలను పంచుకున్నారు. ఆ సందర్భంలో తనకు ఒకసారి ప్రాణాపాయం ఏర్పడగా, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకు రక్షణగా నిలిచారని వెల్లడించారు. “జగన్ నా ప్రాణాలు కాపాడారు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.
ఈ వ్యాఖ్యలు వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారింది. వైసిపి అభిమానులు దీన్ని ప్రచార ఆయుధంగా మార్చుకుంటుండగా, బీజేపీ లోపల మాత్రం ఈ వ్యాఖ్యలు కొత్త చర్చలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ-టిడిపి-జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన సమయంలో, బండి సంజయ్ చేసిన ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
బండి సంజయ్ ఎప్పుడూ స్పష్టంగానే మాట్లాడే నాయకుడని, అందుకే ఆయన మాటలు చర్చనీయాంశమవుతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.