కోనసీమ జిల్లాలో ఘోర ఘటన చోటుచేసుకుంది. ఐ.పోలవరం మండలానికి చెందిన జనసేన పార్టీ నేత రాయపురెడ్డి సత్య వెంకట కృష్ణ (బాబీ)పై లైంగిక దాడి ఆరోపణలు వెలువడ్డాయి. స్థానికంగా ప్రభావశీలుడిగా పేరుగాంచిన ఈ నేత తన పరిసర ప్రాంతంలో పలువురు బాలికలపై కూడా అకృత్యాలకు పాల్పడినట్లు సమాచారం.
తమ కుమార్తెను లైంగికంగా వేధిస్తున్నాడని బాధిత బాలిక తల్లి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, విచారణ ప్రారంభమైన వెంటనే కూటమి నేతల నుంచి కేసును రాజీ చేసేందుకు ఒత్తిళ్లు వస్తున్నాయని పోలీస్ వర్గాలు వెల్లడించాయి.
ఇక మరోవైపు, ఈ ఘటనపై వైఎస్సార్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వారు, “ఇలాంటి ఘోర చర్యలకు పాల్పడిన వారికి కఠిన శిక్ష తప్పద” అని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ప్రజల రక్షణ కోసం రాజకీయ పార్టీలు పనిచేయాల్సిన సమయంలో, అధికార అండతో కొందరు నేతలు బరితెగించి ప్రజలపై దౌర్జన్యాలు ప్రదర్శిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోనసీమ ప్రజలు నిందితుడికి కఠిన శిక్ష విధించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


