కడప అంటే ఒకప్పుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ ప్రభావమే గుర్తుకొచ్చేది. కానీ 2024 ఎన్నికల తర్వాత ఆ రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. కడపలో కొత్త శక్తులు తెరపైకి వచ్చాయి. అలాంటి కుటుంబాల్లో రెడ్డప్ప గారి కుటుంబం ఒకటి.
2019 ఎన్నికల తర్వాత వైసీపీ సంపూర్ణ ఆధిపత్యం సాగిన కష్టకాలంలో, తెలుగుదేశం పార్టీ జిల్లా పగ్గాలు చేపట్టేందుకు ముందుకు వచ్చారు రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి. భార్య మాధవి రెడ్డితో కలిసి ఐదేళ్ల పాటు కడప జిల్లాలో వైసీపీకి గట్టి ప్రతిఘటన చేశారు. కూటమి పార్టీల సహకారంతో పార్టీ ఉనికిని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు.
అయితే రాజకీయ దూకుడుకు ప్రతికూలతలు తప్పలేదు. సొంత పార్టీతో పాటు కూటమిలోనూ రెడ్డప్ప గారి కుటుంబానికి వ్యతిరేక వర్గాలు ఏర్పడ్డాయి. మహానాడు విజయవంతంగా నిర్వహించిన సందర్భంగా చంద్రబాబు అభినందనలు అందుకోవడం ఆయన కృషికి నిదర్శనంగా నిలిచింది.
అయినా అనూహ్యంగా టిడిపి జిల్లా అధ్యక్ష పదవిలో మార్పు జరిగింది. రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి స్థానంలో యువనేత భూపేష్ రెడ్డికి బాధ్యతలు అప్పగించడంతో, రెడ్డప్ప గారి కుటుంబ ప్రత్యర్థుల్లో సంబరాలు మొదలయ్యాయి. కడప రాజకీయాల్లో ఇది కొత్త చర్చకు దారితీస్తోంది.


