వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఇటీవల సరికొత్త అవతారంలో కనిపించారు. ఆయన హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు జెట్ విమానాన్ని స్వయంగా నడుపుతూ ఆకాశంలో విహరించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయగా, అవి క్షణాల్లో వైరల్ అయ్యాయి.
“సరదాగా నేర్చుకున్నాను… విమానం నడపడం చాలా ఆనందంగా ఉంది” అంటూ కేతిరెడ్డి పేర్కొన్నారు. ఈ వీడియోలపై నెటిజన్లు ఆశ్చర్యం, ఆనందం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. రాజకీయాలతో పాటు ఇలాంటి సరదాలు కూడా ఉండాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కాగా, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఆయన తండ్రి మరణంతో 2009లో రాజకీయాల్లోకి ప్రవేశించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయనను ప్రోత్సహించారు. 2019లో రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన కేతిరెడ్డి, “గుడ్ మార్నింగ్ ధర్మవరం” కార్యక్రమంతో ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు. అయితే, 2024 ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ ఓటమి ఆయనను తీవ్రంగా కలచివేసింది. కొంతకాలంగా ఆయన సొంత పార్టీ వైఫల్యాలను కూడా బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఒకానొక సమయంలో ఆయన జనసేన పార్టీలో చేరతారని కూడా వార్తలు వచ్చాయి.
ఇలాంటి పరిస్థితుల మధ్య, కేతిరెడ్డి విమానం నడుపుతూ కనిపించడం ఆయన అభిమానులకు కాస్త ఊరటనిచ్చింది. ఓటమి నుంచి ఆయన క్రమంగా కోలుకుంటున్నారని పలువురు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.