మాజీ మంత్రి కొడాలి నానికి మరోసారి నోటీసుల రూపంలో షాక్ తగిలింది. విశాఖపట్నం పోలీసులు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, ఆయనకు 41 CRPC నోటీసులు అందజేశారు. గతంలో చంద్రబాబు, లోకేష్‌లపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసులో ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోయినా, తాజాగా తిరిగి ఆ కేసు పురోగమించడమే కాకుండా విచారణకు హాజరుకావాలని పోలీసు శాఖ ఆదేశించింది.
కొడాలి నానిపై ఇప్పటికే మద్యం గోడౌన్ బెదిరింపు కేసు, వలంటీర్లకు బలవంతంగా రాజీనామా చేయించిన కేసులు ఉన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావుపై పెట్రోల్ దాడి కేసులో ముందస్తు బెయిల్ కూడా తీసుకున్నారు.
ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కొడాలి నాని ఇటీవల బైపాస్ సర్జరీ చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో యాక్టివ్ కాకపోయినా, విదేశాలకు వెళ్లే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో లుక్ అవుట్ నోటీసులు కూడా జారీయ్యాయి.
ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉన్న పలువురు నేతలు అరెస్టయ్యారు. ఇప్పుడు కొడాలి నాని అరెస్ట్‌కు కూడా అవకాశం ఉందన్న ఊహాగానాలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. రాజకీయంగా ఈ వ్యవహారానికి ఎలాంటి మలుపులు వస్తాయో చూడాలి.