ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రాంతమైన గుంటూరు నగరంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. నగరంలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వీధి కుక్కల నియంత్రణలో నగరపాలక సంస్థ పూర్తిగా విఫలమైందని ఆగ్రహించిన ప్రజలు, అధికారులు మరియు పాలకులుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
పండుగ సెలవులు కావడంతో ఆడుకోవడానికి బయటకు వెళ్లిన నాలుగేళ్ల చిన్నారిని వీధి కుక్కలు అత్యంత దారుణంగా చుట్టుముట్టి దాడి చేశాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడి మరణ వార్త విన్న తండ్రి గుండెలు పగిలేలా రోదిస్తున్న తీరు అందరినీ కలచివేస్తోంది. పండుగ వేళ ఇంటికి చేరిన ఈ విషాదం ఆ కుటుంబంలో తీరని దుఃఖాన్ని నింపింది.
ఈ దారుణ మరణానికి ఎవరు బాధ్యత వహించాలి? ప్రజలు నేరుగా పాలకులను ప్రశ్నిస్తున్నారు. నారా లోకేష్, పవన్ కళ్యాణ్ పాలనలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఏమిటని నిలదీస్తున్నారు. గతంలోనూ అనేకసార్లు వీధి కుక్కల సమస్యపై నగరపాలక సంస్థకు, స్థానిక నేతలకు ఫిర్యాదు చేసినా ఎటువంటి స్పందన లేకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గుంటూరు నగరంలోని ప్రతి వీధిలోనూ కనీసం నాలుగు నుండి ఐదు వీధి కుక్కలు గుంపులుగా తిరుగుతున్నాయి. అవి కేవలం ఆహారం కోసం మాత్రమే కాకుండా, ఒక్కోసారి కారణం లేకుండానే వెంటపడుతూ దాడి చేస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూర్చోనివ్వకుండా, నడవనివ్వకుండా భయానకమైన పరిస్థితులు నెలకొన్నాయని వాపోతున్నారు.
ఇంత జరుగుతున్నా ఈ పరిస్థితిని ఏమాత్రం పట్టించుకోని పాలకులకు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందని ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా నగరపాలక సంస్థ కళ్లు తెరిచి వీధి కుక్కల నియంత్రణకు తక్షణ చర్యలు చేపట్టాలని, భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.