లోటస్ ఫండ్ మళ్లీ రాజకీయ చర్చలకు కేంద్రబిందువైంది. ఒకప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కేంద్రంగా నిలిచిన ఈ భవనానికి చాలా సంవత్సరాల తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి రావడం విశేషంగా మారింది. 2012 నుంచి 2019 వరకు పార్టీ నాయకత్వం, కార్యాచరణలన్నీ ఈ భవనం ద్వారానే నడిచేవి. 2019 ఎన్నికల తరువాత తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ ఏర్పడడంతో లోటస్ ఫండ్ ప్రాధాన్యం తగ్గిపోయింది.
షర్మిలతో విభేదాలు, కుటుంబ ఆస్తులపై ప్రచారాలు, అంతర్గత ఉద్రిక్తతలు ఇవన్నీ కలిసి లోటస్ ఫండ్‌పై పలు రకాల కథనాలను తీసుకొచ్చాయి. అయితే నాంపల్లి సిబిఐ కోర్టులో హాజరైన తర్వాత జగన్మోహన్ రెడ్డి అక్కడ గడపడంతో అన్ని ఊహాగానాలకు బ్రేక్ పడింది.
ఇటీవల ఎన్నికల్లో పరాజయం అనంతరం జగన్ ఎక్కువగా బెంగళూరులోనే ఉంటూ, తాడేపల్లికి వారంలో కొన్ని రోజులు మాత్రమే వస్తున్నారు. ఇక హైదరాబాదులో ఉన్న వైసీపీ నేతలు, కేసుల కారణంగా అక్కడే తలదాచుకుంటున్న కార్యకర్తలతో సమన్వయం కోసం లోటస్ ఫండ్‌ను మళ్లీ సజీవం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లాగే, ఇప్పుడు జగన్ కూడా హైదరాబాదులో ఉండే నాయకులు.. కార్యకర్తల కోసం నెలలో ఒకసారి లోటస్ ఫండ్ నుంచే కార్యకలాపాలు ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో లోటస్ ఫండ్‌కు మళ్లీ పాత రద్దీ, పాత రాజకీయ రంగు తిరిగి రావొచ్చని అందరూ భావిస్తున్నారు.


