మహా న్యూస్ ఛానెల్ అధిపతి వంశీ వ్యవహారంపై బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “మహా న్యూస్ వంశీ మొన్న తప్పించుకున్నాడు కానీ వాడిని వదిలే ప్రసక్తే లేదు” అని హెచ్చరించారు. పోలీసుల తీరుపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
గాదరి కిషోర్ తన ప్రెస్ మీట్‌లో వంశీ ప్రస్థానంపై సంచలన ప్రశ్నలు సంధించారు. “వంశీ ఆంధ్రజ్యోతిలో స్ట్రింగర్ లాగా పని చేసి మహా న్యూస్ ఛానెల్ ఓనర్ ఎలా అయ్యాడో అని మేము అడగొచ్చా?” అని సూటిగా ప్రశ్నించారు. అంతేకాకుండా, “వంశీ ఎలాంటి లంగా పనులు చేసి, ఇల్లీగల్ దందాలు చేసి ఓనర్ అయ్యాడో మేము మాట్లాడొచ్చా?” అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో, మీడియా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
వంశీ వ్యవహారంలో పోలీసుల వైఖరిని గాదరి కిషోర్ తీవ్రంగా తప్పుబట్టారు. “పోలీసులా కాంగ్రెస్ కార్యకర్తలా?” అని ప్రశ్నిస్తూ, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు. “అనైతికంగా ప్రవర్తిస్తున్న పోలీసుల పేర్లు కూడా గుర్తు పెట్టుకుంటాం.. వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు” అని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు అధికార పక్షంపై, పోలీసు వ్యవస్థపై తీవ్ర విమర్శలకు తావిచ్చాయి.
గాదరి కిషోర్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే లేపాయి. ఒకవైపు మహా న్యూస్ ఛానెల్, దాని అధిపతి వంశీపై గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఆరోపణలు, దాడులు చర్చనీయాంశంగా మారగా, ఇప్పుడు బీఆర్ఎస్ నేత చేసిన ఈ వ్యాఖ్యలు మరింత వేడిని రాజేశాయి. ఈ వ్యవహారంపై ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి. అలాగే, మహా న్యూస్ వంశీ, ఆయన ఛానెల్ ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది.