టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా అక్కడ జనసందోహం కనిపిస్తుంది. తాజాగా బెంగళూరులో కొత్తగా ప్రారంభమైన AMB సినిమాస్ ప్రారంభోత్సవానికి మహేష్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అయితే అక్కడ మహేష్‌కు ఎదురైన అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
మహేష్ బాబు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న కన్నడ అభిమానులు భారీ సంఖ్యలో థియేటర్ వద్దకు చేరుకున్నారు. మహేష్ కారు దిగడమే ఆలస్యం.. ఆయనను ఒక్కసారి చూసేందుకు, ఫోటోలు తీసుకునేందుకు ఫ్యాన్స్ ఒక్కసారిగా మీద పడ్డారు. పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందంటే, మహేష్ బాబు జనసందోహం మధ్యలో పూర్తిగా ఇరుక్కుపోయారు.
మహేష్ బాబును సురక్షితంగా లోపలికి తీసుకెళ్లడం పోలీసులకు, వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బందికి పెద్ద సవాలుగా మారింది.ఫ్యాన్స్ ఒక్కసారిగా ముందుకు రావడంతో తీవ్రమైన తోపులాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి, అతి కష్టం మీద మహేష్ బాబును థియేటర్ లోపలికి పంపగలిగారు.ఈ హడావిడిలో మహేష్ బాబు ఫ్యాన్స్ మధ్య నలిగిపోయి, తీవ్ర ఇబ్బంది పడాల్సి వచ్చింది. మహేష్ బాబును చూడాలనే ఉత్సాహంలో ఫ్యాన్స్ నియంత్రణ కోల్పోయారు. సెక్యూరిటీ వలయాన్ని దాటుకుని మరీ హీరో వైపు దూసుకెళ్లడంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
ఎలాగోలా థియేటర్ లోపలికి చేరుకున్న మహేష్ AMB సినిమాస్ గ్రాండ్ ఓపెనింగ్‌ను పూర్తి చేశారు. అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలిపినప్పటికీ, ఇంతటి భారీ స్థాయిలో జనం వస్తారని సెక్యూరిటీ సిబ్బంది అంచనా వేయలేకపోయినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

