ఎన్నారైలపై కూటమి ప్రభుత్వ ఉక్కుపాదం కొనసాగుతోంది. విదేశాల్లో నివసిస్తూ తమ స్వగ్రామం, తమ రాష్ట్రంపై అభిప్రాయాలు వ్యక్తం చేసినా ఇప్పుడు అది కూడా “నేరం”గా మారినట్లు కనిపిస్తోంది. తాజాగా లండన్‌లో సూపర్‌మార్కెట్ నిర్వహిస్తున్న మాలపాటి భాస్కర్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం చేసిన అక్రమ అరెస్టు దీనికి తాజా ఉదాహరణ.
భాస్కర్ రెడ్డి స్వగ్రామం కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరం. ఈ నెల 1వ తేదీ తన తండ్రి మరణంతో లండన్ నుంచి స్వగ్రామానికి వచ్చిన ఆయన కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే, వైద్య పరీక్షల కోసం తాడిగడపలోని కామినేని హాస్పిటల్‌కు వెళ్లిన సమయంలో మఫ్టీ దుస్తుల్లో వచ్చిన పోలీసులు భాస్కర్ రెడ్డిని అరెస్టు చేశారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే — ఏ కేసులో అరెస్టు చేశారో, ఎక్కడికి తీసుకెళ్లారో కూడా కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇవ్వలేదు. విచారకరంగా సమాధానం ఇస్తున్న పెనమలూరు పోలీసులు కుటుంబ సభ్యుల ఆందోళనను మరింత పెంచుతున్నారు.
వైసీపీకి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడమే కారణమని స్థానికులు చెబుతున్నారు. ఇది నిజమైతే — “ఇక దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది?” అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎన్నారైలపై ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ అమలవుతోందని, వారిని కూడా కక్షపూరితంగా వేధిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్టును ఖండించిన పెనమలూరు వైసీపీ ఇంచార్జి దేవభక్తుని చక్రవర్తి, ఇది ప్రజాస్వామ్యంపై నేరుగా దాడి అని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
ఎన్నారైలు తమ స్వగ్రామాలకు వచ్చి తమ కుటుంబాలతో ఉండడమే ఇప్పుడు “నేరమా”?ఇదే ప్రశ్న ప్రజల్లో చర్చనీయాంశమవుతోంది.


