ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, వాటికి వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇచ్చిన ఘాటు కౌంటర్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ ఏమీ చేయలేకపోయిందని, ఇప్పుడు విదేశాల్లో కూర్చుని సోషల్ మీడియాలో విమర్శలు చేయడం సరికాదని పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా ద్వారా కాకుండా నేరుగా ప్రజల్లోకి వచ్చి మాట్లాడాలని, రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం ఉందా అని ఆయన సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలు కూటమి శ్రేణుల్లో జోష్ నింపినప్పటికీ, ప్రతిపక్ష వైసీపీకి ఆగ్రహాన్ని తెప్పించాయి.
దీనికి స్పందించిన అంబటి రాంబాబు తనదైన శైలిలో ఘాటైన కౌంటర్ ఇచ్చారు. “మేము పీకలేకపోయాం అంటున్నారు. మీరు వచ్చారుగా… వచ్చి పీకండి! సిద్ధంగా ఉన్నాం పీకించుకోడానికి!” అంటూ పవన్ కళ్యాణ్‌ను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. ఈ మాటలు క్షణాల్లోనే వైరల్ అయ్యాయి.
ఈ వ్యాఖ్యలతో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరినట్టే కనిపిస్తోంది. ఒకవైపు పవన్ కళ్యాణ్ తన రాజకీయ బలాన్ని ప్రజాక్షేత్రంలో చూపిస్తామని అంటుంటే, మరోవైపు వైసీపీ నేతలు కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్న సంకేతాలు ఇస్తున్నారు. ఈ పరిణామాలతో రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత వేడెక్కడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


