ys jagan mohan reddy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని సీన్ ఒకటి కనిపించింది. సాధారణంగా మాటల యుద్ధం, పరస్పర విమర్శలతోనే వార్తల్లో నిలిచే రాజకీయ నాయకులు… ఈసారి మాత్రం మర్యాద, సంస్కారం చూపించి అందరికీ ఆశ్చర్యం కలిగించారు.
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ కార్యాలయం అధికారిక ట్విట్టర్ (ఎక్స్) హ్యాండిల్ ద్వారా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఆ ట్వీట్‌లో “మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, సుఖసంతోషాలు కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ఇది సంచలనంగా మారడానికి కారణం… నిన్న మొన్నటి వరకూ వైసీపీపై, జగన్ పాలనపై పవన్ తీవ్ర విమర్శలు చేయడమే. అలాంటి పరిస్థితుల్లోనూ రాజకీయ విభేదాలను పక్కనపెట్టి, వ్యక్తిగతంగా శుభాకాంక్షలు చెప్పడం అందరి దృష్టిని ఆకర్షించింది.
ఇదే కాకుండా, జగన్ కూడా వెంటనే స్పందించారు. “Thank you for the wishes Pawan Kalyan garu” అంటూ పవన్‌ను ట్యాగ్ చేస్తూ రిప్లై ఇవ్వడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని మరింత పెంచింది.
ఈ పరిణామాన్ని చూసిన ప్రజలు, సోషల్ మీడియా యూజర్లు స్పందిస్తున్నారు. “రాజకీయాల్లో తిట్టుకోవడం సహజం… కానీ ఇలాంటి సందర్భాల్లో పరస్పర గౌరవం చూపించడమే అసలైన రాజకీయ సంస్కారం” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మొత్తానికి… రాజకీయ ప్రత్యర్థులైనా సరే, వ్యక్తిగతంగా శుభాకాంక్షలు చెప్పుకోవడం, మర్యాదగా స్పందించడం చూసి చాలామంది ఫిదా అవుతున్నారు. ఇదే రాజకీయాలకు కావాల్సిన పరిపక్వత అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


