ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ జిల్లాలో దెబ్బతిన్న కొబ్బరి తోటల పరిశీలన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కోనసీమలోని కొబ్బరి చెట్ల మృతికి గల కారణాలపై ఆయన చేసిన సంచలన కామెంట్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కొన్ని నెలలుగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గ పరిధిలో వేల సంఖ్యలో కొబ్బరి చెట్లు ఎండిపోయి, రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. సముద్రపు నీరు వెనక్కి రావడం , మురుగు కాల్వల్లోని నీటిలో లవణాల శాతం పెరగడం వల్ల ఈ నష్టం జరిగిందని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆ ప్రాంతాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్… అక్కడి పచ్చదనాన్ని చూసి తీవ్ర భావోద్వేగానికి లోనై ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
“కొబ్బరి చెట్లకు తెలంగాణ వాళ్ల దిష్టి తగిలేసింది. రాష్ట్రం విడిపోవడానికి కారణం గోదావరి జిల్లాల పచ్చదనమే.. ఆ శాపం తగిలేసినట్టుంది,” అని పవన్ కళ్యాణ్ అన్నట్లుగా ఉన్న వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి.
ఈ వ్యాఖ్యలను తెలంగాణలోని కొంతమంది నాయకులు, నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. కొబ్బరి చెట్ల నాశనానికి సాంకేతిక, భౌగోళిక కారణాలుంటే, వాటిని రాజకీయం చేస్తూ ‘దిష్టి’ వంటి అంశాలను ప్రస్తావించడం సరికాదని విమర్శిస్తున్నారు. ఒక ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇటువంటి మాటలు మాట్లాడటం సరైన విధానం కాదని హితవు పలుకుతున్నారు.


