ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత పదిరోజులుగా భీమవరం డీఎస్పీ జయసూర్య పేరు హాట్‌టాపిక్‌గా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేకాట శిబిరాలు, సివిల్ తగాదాల్లో జోక్యం వంటి ఆరోపణలపై ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసి నివేదిక కోరారు. ఈ ఘటనతో డీఎస్పీ జయసూర్య వ్యవహార శైలి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
అయితే, తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గృహ మంత్రిత్వ దక్షత పతకాల జాబితాలో జయసూర్య పేరు ఉండడం రాజకీయంగా కొత్త మలుపు తీసుకువచ్చింది. గతంలో కీలక కేసు పరిష్కారంలో చూపిన సమర్థతకు ఈ అవార్డు దక్కిందని కేంద్రం తెలిపింది.
ఈ పరిణామంతో పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలపై కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పవన్‌కు ఎవరు ఫిర్యాదు చేశారన్నది, ఆ సమాచారం ఎంతవరకు నిజమన్నది స్పష్టత లేకుండా ఉంది. మరోవైపు, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తాజాగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ, మంత్రులు శాఖల్లో లోపాలు గుర్తించడం సహజమని అన్నారు.
ఇన్ని ఆరోపణల మధ్యే జయసూర్యకు కేంద్ర అవార్డు రావడం, ఇది పవన్ కళ్యాణ్‌కు సవాల్‌లా మారిందా అనే చర్చ సాగుతోంది. పవన్ ఆదేశాలను, పవన్ ఆర్డర్ లను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. పవన్ ను కూరలో కరివేపాకులా తీసేశారా? అన్న చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. మొత్తం మీద ఈ “పేకాట వివాదం” ఏపీలో రాజకీయ వేడి పెంచిన అంశంగా మారింది.


