కోనసీమపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే లేపాయి. “కోనసీమకు తెలంగాణ వాళ్ల దిష్టి తగిలింది” అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని, లేకపోతే ఆయన సినిమాలు తెలంగాణలో ఆడనివ్వబోమంటూ మంత్రి గట్టి వార్నింగ్ ఇవ్వడం హాట్‌టాపిక్‌గా మారింది.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరికల అనంతరం, పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. ముఖ్యంగా ట్విట్టర్ (ఎక్స్) వేదికగా మంత్రి కోమటిరెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు, ట్రోల్స్ మొదలుపెట్టారు. గత రెండు రోజులుగా మంత్రిని టార్గెట్ చేస్తూ వ్యక్తిగత విమర్శలు, అసభ్యకరమైన పోస్టులతో సోషల్ మీడియాలో హోరెత్తించారు. ఈ పోస్టులు అభ్యంతరకరంగా మారడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి వస్తున్న ఈ దూషణలు, అనుచిత వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి టీమ్ తీవ్రంగా స్పందించింది. నల్గొండ ఎమ్మెల్యే, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో మంత్రి గారిపై ట్విట్టర్ వేదికగా వ్యక్తిగత విమర్శలు, అసభ్యకరంగా పోస్టులు పెడుతున్న పలువురు పవన్ కళ్యాణ్ అభిమానుల ట్విట్టర్ ఖాతాదారుల మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సిబ్బంది సైబరాబాద్ సీసీఎస్ పోలీసులకు పిర్యాదు చేయనున్నారు.
తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ రగడ కొనసాగుతుండగానే, మంత్రిపై ఫ్యాన్స్ చేసిన పోస్టులు ఇప్పుడు మరో కొత్త వివాదానికి దారి తీశాయి. అభిమానులు హద్దులు దాటి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వల్ల ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ మెట్ల వరకు చేరింది.


