సినిమా థియేటర్లో ఏసీ కుర్చీలో కూర్చొని, కాలి మీద కాలు వేసుకొని సినిమా చూడటానికి కొందరు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా టికెట్ రేటు రూ.1400 అని వార్తలు వచ్చాయి. కానీ అదే సమయంలో రాయలసీమలోని కర్నూలు జిల్లాలో ఉల్లిరైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మూడు నెలలు కష్టపడి పండించిన ఉల్లికి క్వింటాలుకు కేవలం రూ.1000 మాత్రమే ధర లభిస్తోంది. ఖర్చులు, విత్తనాలు, ఎరువులు, నీటి వ్యయం కలిపి రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు. ఈ పరిస్థితిని ఒక ఉల్లి రైతు కుమారుడు కన్నీళ్లతో ప్రస్తావించాడు. “మా నాన్న మూడు నెలలు కష్టపడి ఉల్లిపంట పండించారు. ఒక క్వింటాలుకు రూ.1000 ఇస్తున్నారు. కానీ సినిమా టికెట్ రూ.1400 అంటున్నారు. మా ఉల్లికి అంతైనా విలువ ఇవ్వరా?” అని ఆ చిన్న పిల్లవాడి ప్రశ్న మనసును కదిలిస్తోంది.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్నవాడే అయినా అతని మాటల్లో ఉన్న నిజాయితీ, బాధ అనేక మందిని ఆలోచనలో పడేసింది. రైతుల కష్టం, వారి జీవితాల్లోని వాస్తవం స్పష్టంగా బయటపడింది.
దీన్ని చూసిన నెటిజన్లు కూడా పవన్ కళ్యాణ్‌పై ప్రశ్నలు గుప్పిస్తున్నారు. “డిప్యూటీ సీఎం గా ఉన్న నీకు ఈ చిన్న పిల్లాడికన్నా అవగాహన లేదా?”, “రైతుల పట్ల నీ సమాజ బాధ్యత ఎక్కడ?” అంటూ విమర్శలు చేస్తున్నారు.
సినిమా టికెట్లకు వేల రూపాయలు చెల్లించే సమాజం, రైతుల చెమట చుక్కకు మాత్రం తగిన ధర ఇవ్వని వాస్తవం – మనలోని అసమానతను మళ్లీ గుర్తు చేస్తోంది.