పిఠాపురం నియోజకవర్గం మళ్లీ రాజకీయ చర్చలకు కేంద్రబిందువైంది. ఉప్పాడ తీరంలో మత్స్యకారులు రసాయన పరిశ్రమల వ్యర్థాలపై ఆందోళన వ్యక్తం చేయగా.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వడంతో వారు ఉద్యమాన్ని విరమించారు. అయితే ఈ ఆందోళన వెనుక రాజకీయ ఆటలున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
టిడిపి నేత వర్మ అనుచరుల అసంతృప్తి ఈ పరిణామాలకు కారణమని జనం చెవులు కొరుక్కుంటున్నారు. 2024 ఎన్నికలకు ముందు వర్మకు కేటాయించాల్సిన సీటు చివరికి జనసేనకు దక్కింది. పవన్ గెలిచినా, వర్మకు ఆశించిన స్థానం రాకపోవడంతో వారి వర్గం అసంతృప్తిగా ఉన్నట్టు చెబుతున్నారు.
ఇక జనసేనలోనూ గ్రూపు తగాదాలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. పరస్పరం ఆరోపణలు, ఫిర్యాదులు పెరగడంతో పార్టీ కమిటీని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమయంలోనే మత్స్యకారుల ఆందోళన రావడం, అది పర్యావరణ శాఖను నిర్వహిస్తున్న పవన్‌పై ఒత్తిడి పెంచే విధంగా ఉండటం అనుమానాస్పదంగా మారింది.
అందువల్ల ఈ ఆందోళన వెనుక “అదృశ్య శక్తి” ఉందన్న ప్రచారం జోరందుకుంది. పవన్ కళ్యాణ్ సైతం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారని సమాచారం. పిఠాపురం రాజకీయాల్లో ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి.