ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఒకప్పుడు “ప్రశ్నిస్తాను” అంటూ పార్టీ పెట్టిన పవన్, ఈరోజు మాత్రం ప్రశ్నించవద్దన్నట్టుగా వ్యవహరిస్తున్నారా అన్న సందేహం ప్రజల్లో కలుగుతోంది. పిఠాపురంలో సంక్రాంతి సంబరాల్లో చేసిన ప్రసంగంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను మరోసారి కీర్తిస్తూ, తమ మధ్య ఎలాంటి అరమరికలు లేవని చెప్పడం రాజకీయంగా సహజమే. కానీ అదే సమయంలో ప్రభుత్వ పనితీరుపై ఒక్క ప్రశ్న కూడా లేకపోవడం విమర్శలకు దారి తీస్తోంది.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలయ్యాయి? కూటమి ప్రభుత్వం ప్రజల అంచనాలను ఎంత మేర నెరవేర్చింది? వంటి కీలక అంశాలపై మాట్లాడకుండా, సంబరాలు డాన్సులు ప్రసంగాలకే పరిమితమవడం పవన్ పాత్రపై సందేహాలు పెంచుతోంది. గతంలో ఇతర నేతలపై చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు తానే అదే బాటలో నడుస్తున్నారా అన్న ప్రశ్నలు సహజంగా వస్తున్నాయి.
ఒకవైపు కులమతాలకు అతీతమంటూ మాట్లాడుతూ, మరోవైపు సందర్భానుసారం భిన్న స్వరాలు వినిపించడం రాజకీయ స్థిరత్వంపై ప్రశ్నలు లేపుతోంది. అలాగే, వైసీపీపై తీవ్ర విమర్శలు చేసిన రోజులు గుర్తుకు వస్తే, ప్రస్తుతం ఆ స్థాయి ప్రశ్నలు ఎందుకు లేవన్నది కూడా చర్చనీయాంశమే. ముఖ్యంగా పిఠాపురం వంటి ప్రాంతాల్లో ఉన్న స్థానిక సమస్యలపై స్పష్టమైన కార్యాచరణ లేకపోవడం ప్రజల్లో అసంతృప్తిని పెంచుతోంది.
మొత్తానికి, పదవిలో ఉన్నంతకాలం ప్రశ్నల నుంచి దూరంగా ఉండి, పొగడ్తల రాజకీయానికే పరిమితమైతే జనసేన ఆశయాలు ఏమవుతాయన్నది కార్యకర్తలకే కాదు, ప్రజలకూ ఆలోచన కలిగిస్తోంది. రాజకీయాల్లో ప్రశ్నించడమే అసలు బలం. ఆ బలం తగ్గితే, మిగిలేది కేవలం అధికారం ఆనందమే అన్న భావన పెరుగుతోంది.


