ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సరదా సంభాషణలతో సందడిగా మారాయి. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ రాజు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన ఒక సంభాషణ అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అసెంబ్లీలో ప్లాస్టిక్ నిషేధం గురించి చర్చ జరుగుతున్నప్పుడు, రఘురామ కృష్ణ రాజు ఒక ఆసక్తికరమైన సూచన చేశారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించడానికి పవన్ కళ్యాణ్ ఒక యాడ్ లో నటించి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. “సాధారణంగా మీలాంటి హీరోలు యాడ్స్ చేయాలంటే కోట్లు ఇవాల్సి వస్తుంది. కానీ ప్రభుత్వంలో నాయకుడిగా మీరు ఉచితంగా చేయాలి,” అంటూ చమత్కరించారు.
రఘురామ తన సంభాషణను కొనసాగిస్తూ, పవన్ కళ్యాణ్ తన కాలర్ ఎగరేసి ఫ్యాన్స్ కి ఒక్కమాట చెబితే చాలు, ఆంధ్రప్రదేశ్ లో చెత్త మొత్తం క్లీన్ అయిపోతుందని వ్యాఖ్యానించారు. ఈ మాటలకు పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా నవ్వేశారు. రఘురామ మాట్లాడుతున్న తీరు, ఆయన వేసిన జోకులకు పవన్ నవ్వుతూ కనిపించారు.
ఈ అరుదైన, సరదా సన్నివేశం అసెంబ్లీలో నవ్వులు పూయించడమే కాకుండా అధికార పార్టీ నాయకుల మధ్య ఉన్న స్నేహపూర్వక వాతావరణాన్ని కూడా చాటిచెప్పింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది.